Close

    తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము – చరిత్ర

    hc

    తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము ఏడవ నిజాం హెచ్.ఈ.హెచ్. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ద్వార స్థాపించబడినది. ఆరంభములో హైదరాబాద్ దక్కన్ సంస్థానము యొక్క ఉన్నత న్యాయస్థానముగా, హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానము ఆరుగురు న్యాయమూర్తులతో 1919లో ఏర్పాటు చేయడమైనది.

    భారత దేశానికి ఆగస్టు 15, 1947 లోనే స్వాతంత్ర్యము లభించినప్పటికీ, హైదరాబాద్ సంస్థానం సెప్టెంబరు 17, 1948 లో మాత్రమే భారత దేశములో విలీనమైనది. భారత రాజ్యాంగములోని 374(4) అధికరణము ద్వారా ఉన్నత న్యాయస్థాన తీర్పులపై జ్యూడిషియల్ కమిటీ ముందు పెండింగులో ఉన్న అప్పీళ్ళు భారత సర్వోత్తమ న్యాయస్థానానికి బదిలి చేయబడినవి.

    రాష్ట్రాల పునర్విభజన చట్టము, 1956 ప్రకారము భాషా ప్రాయుక్త రాష్ట్రాల ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఏర్పాటు అయ్యాక ఉన్నత న్యాయస్థానము పేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానముగా నవంబరు 5, 1956న మార్చడమైనది. ఈ ఉన్నత న్యాయస్థానము 1956 నుంచి 2014 వరకు హైదరబాద్ ప్రధాన కేంద్రంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సేవలందించడం జరిగినది. ఈ కాలంలో న్యాయమూర్తుల సంఖ్య 1956 లో 12 నుంచి 2014 లో 61 కి పెరిగినది.

    ఉన్నత న్యాయస్థానము స్థాపించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఉన్నత న్యాయస్థానం యొక్క ‘అర్ధ శతాబ్దపు ఉత్సవాలు’ 2006లో నిర్వహించడం జరిగినది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి (అప్పటి) శ్రీయుత ఏ.పీ.జే. అబ్దుల్ కలాం గారు మరియు ఇతర విశిష్ఠ అతిధులు ఈ వేడుకలలో పాల్గొన్నారు.

    ఆంధ్ర ప్రదేశ్ పునర్విభజన చట్టము, 2014 ననుసరించి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విభజన జరిగాక, ఉన్నత న్యాయస్థానము పేరుని ‘హైకోర్టు ఆఫ్ జ్యుడికేచర్ ఎట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ గా మార్చడమైనది, ఈ ఉన్నత న్యాయస్థానం రెండు రాష్ట్రాలకు సేవలందించింది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి గారు డిసెంబరు 26, 2018 న ఈ ఉమ్మడి ఉన్నత న్యాయస్థానాన్ని విభజిస్తూ ఉత్తర్వులివ్వడం జరిగినది. వీటి ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి హైదరబాదు కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము, మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానాల ఏర్పాటు జరిగినది. ఈ విభజన మరియు ఈ రెండు రాష్ట్రాల కొత్త ఉన్నత న్యాయస్థానాలు ఏర్పాటు జనవరి 1, 2019 నుంచి అమలులోకి వచ్చినది.

    ఈ విధముగా ఉన్నత న్యాయస్థానము మూడు రాష్ట్రాలకు సేవలందించినది – నిజాం కాలం నాటి హైదరాబాదు రాచరిక సంస్థానము, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరియు తెలంగాణ రాష్ట్రము.

    భారత సర్వోత్తమ న్యాయస్థనమునకు విశిష్టమైన న్యాయమూర్తులని అందించిన ప్రత్యేకతని మరియు గౌరవాన్ని ఈ ఉన్నత న్యాయస్థానము కలిగి ఉంది. ఇక్కడ న్యాయమూర్తులుగా పనిచేసి సర్వోత్తమ న్యాయస్థానములో న్యాయమూర్తులుగా పదవులను అలంకరించినవారు – జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ పి. సత్యనారాయణ రాజు, జస్టిస్ పి. రామస్వామి, జస్టిస్ ఓ. చిన్నప్ప రెడ్డి, జస్టిస్ కే. రామస్వామి, జస్టిస్ కే. జయచంద్రా రెడ్డి, జస్టిస్ బి.పి. జీవన్ రెడ్డి, జస్టిస్ యం. జగన్నాధ రావు, జస్టిస్ సయ్యద్ షా మొహమ్మద్ ఖాద్రి, జస్టిస్ పి. వెంకట్రామ రెడ్డి, జస్టిస్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎన్.వి. రమణ మరియు జస్టిస్ ఆర్. సుభాష్ రెడ్డి.